1 Corinthians 3
"సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసి వచ్చెను."
అప్పటిలో మీకు బలము చాలక పోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా?
మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడచుకొనువారుకారా?
"ఒకడు నేను పౌలు వాడను, మరియొకడు నేను అపొల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులుకారా?"
అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి.
"నేను నాటితిని, అపొల్లో నీళ్ళు పోసెను. వృద్ధి కలుగజేసినవాడు దేవుడే."
"కాబట్టి, వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను, నీళ్ళు పోయువానిలోనైనను ఏమియు లేదు."
"నాటువాడును, నీళ్ళు పోయువాడును ఒకటే, ప్రతివాడును తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును."
మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.
దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారుని వలె పునాది వేసితిని. మరియొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రతగా చూచుకొనవలెను.
వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు ; ఈ పునాది యేసుక్రీస్తే.
"ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల, వాని వాని పని కనబడును."
ఆ దినము దానిని తేట పరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.
పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును.
"ఒకని పని కాల్చి వేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని, అగ్నిలోనుండి తప్పించు కొన్నట్టు రక్షింపబడును."
"మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడనియు మీరెరుగరా?"
"ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది, మీరు ఆ ఆలయమైయున్నారు."
ఎవడును తన్ను తాను మోసపరచుకొన కూడదు. మీలోఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకొనిన యెడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను.
ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే.
జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును; మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.
కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.
"పౌలైనను అపొల్లోయైనను కేఫాయైనను, లోకమైనను, జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవియైనను, రాబోవునవియైనను సమస్తమును మీవే."
మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవుని వాడు.